అవతరణికా

గురువులపై దేవతలపై తారతమ్యముగా చేయు భక్తి సకలపురుషార్థసాధనమైనది గావున అవశ్యముగ అనుష్ఠానముచేయవలసినది. అటువంటి భక్తిని ఎటుల చేయవలెను ఆ భక్తియొక్క ఫలమేమి అని ఈ శ్లోకములో చెప్పుచున్నారు

 

విష్ణోరత్యుత్తమత్వాదఖిలగుణగణైస్తత్ర భక్తిం గరిష్ఠాం

సంశ్లిష్టే శ్రీధరాభ్యామముమథ పరివారాత్మనా సేవకేషు .

యః సంధత్తే విరించిశ్వసనవిహగపానంతరుద్రేందపూర్వే-

ష్వాధ్యాయంస్తారతమ్యం స్ఫుటమవతి సదా వాయురస్మద్గురుస్తమ్ ..15..

అన్వయము

యః అఖిలగుణగణైః విష్ణోః అత్యుత్తమత్వాత్ శ్రీధరాభ్యాం సంశ్లిష్టే తత్ర గరిష్ఠాం భక్తిం సంధత్తే అథ అముం (ప్రతి) పరివారాత్మనా సేవకేషు విరించిశ్వసనవిహగపానంతరుద్రేందపూర్వేషు తారతమ్యం ఆధ్యాయన్ భక్తిం సంధత్తే తం అస్మద్గురుః స్ఫుటం అవతి

తాత్పర్యము

ఎవడైతే సకలగుణములతో శ్రీమహావిష్ణువు అత్యుత్తముడైనందువలన శ్రీదేవి, భూదేవులతో కూడియున్న అతనియందు అత్యుత్తమమైన భక్తిని చేయునో మఱియు అతని పరివారరూపముగా సేవకులైన బ్రహ్మ, వాయు, గరుడ, శేష, ఇంద్ర మొదలైనవారియందు గల తారతమ్యమును తెలియుచు వారియందు భక్తిని చేయునో అతడిని మన గురువులైన ముఖ్యప్రాణులు బాగుగా రక్షింతురు.

అవతరణికా

మూర్ధన్యేషోంజలిర్మే అను వెనుకటి శ్లోకములో భక్తిని ప్రసాదించమని ప్రార్థించడం జరిగింది. ఈ శ్లోకములో విశేషభక్తిని ప్రార్ధించుచున్నారు.

మాతర్మే మాతరిశ్వన్ పితరతులగురో భ్రాతరిష్టాప్తబంధో

స్వామిన్ సర్వాంతరాత్మన్నజరజరయితర్జన్మమృత్యామయానామ్ .

గోవిందే దేహి భక్తిం భవతి చ భగవన్నూర్జితాం నిర్నిమిత్తాం

నిర్వ్యాజాం నిశ్చలాం సద్గుణగణబృహతీం శాశ్వతీమాశు దేవ ..14..

అన్వయము

హే మాతః, పితః, అతులగురో, భ్రాతః, ఇష్ట, ఆప్తబంధో, స్వామిన్, సర్వాంతరాత్మన్, అజర, జన్మమృత్యామయానాం జరయితః, భగవన్, దేవ, మాతరిశ్వన్, మే ఊర్జితాం నిర్నిమిత్తాం నిర్వ్యాజాం నిశ్చలాం సద్గుణగణబృహతీం భక్తిం గోవిందే ఆశు దేహి.

తాత్పర్యము

మాతః – తల్లియైన పితః – తండ్రియైన అతులగురో – అసదృశులైన గురువరేణ్య భ్రాతః – సహోదర ఇష్ట – ప్రియుడా ఆత్మబంధో – ఆప్తబాంధవుడా స్వామిన్ – నియామకుడా సర్వాంతరాత్మన్ – సర్వాంతర్యామి అజర – ముప్పులేనివాడా జన్మ-మృతి-ఆమయానాం – జనన-మరణ-వ్యాధులను జరయితః – నశింపడేయువాడా భగవన్ – షడ్గుణైశ్వరశాలి దేవ – జ్ఞానాదిగుణసంప్పన్నుడా హే మాతరిశ్వన్ – వాయుదేవ మే – నాకు ఊర్జితాం – పెంపొందిన నిర్నిమిత్తాం – నిరుపాధికమైన నిర్వ్యాజాం – డాంభికముకానటువంటి నిశ్చలాం – నిశ్చలమైన సద్గుణగణబృహతీం – సద్గుణసమూహముచే నిండిన భక్తిం – భక్తిని గోవిందే – గోవిందునిపై ఆశు – వేగిరముగా దేహి – ఇవ్వుము.

అవతరణికా

అసురులు అంధంతమస్సులో దుఃఖమును అనుభవించెదరు అని తెలిపిరి. ఆ అంధంతమస్సు ఎటువంటిది. అచ్చటి దుఃఖము ఎటువంటిది. ఈ ప్రశ్నలకు ఉత్తరముగా అంధంతమస్సుయొక్క స్వరూపమును వివరించుచున్నారు.

క్షుత్-క్షామాన్ రూక్షరక్షోరదఖరనఖరక్షుణ్ణవిక్షోభితాక్షాన్ .

ఆమగ్నానంధకూపే క్షురముఖముఖరైః పక్షిభిర్విక్షతాంగాన్ ..

పూయాసృఙ్మూత్రవిష్టాకృమికులకలిలే తత్క్షణాక్షిప్తశక్త్యా-

ద్యస్త్రవ్రాతార్దితాంస్త్వద్ద్విష ఉపజిహతే వజ్రకల్పా జలూకాః ..13..

అన్వయము

క్షుత్-క్షామాన్ రూక్షరక్షోరదఖరనఖరక్షుణ్ణవిక్షోభితాక్షాన్ ఆంధకూపే ఆమగ్నాన్ క్షురముఖముఖరైః పక్షిభిః విక్షతాంగాన్ పూయాసృఙ్మూత్రవిష్టాకృమికులకలిలే తత్క్షణాక్షిప్తశక్త్యాద్యస్త్రవ్రాతార్దితాన్ త్వద్దిషః వజ్రకల్పాః జలూకాః ఉపజిహతే.

తాత్పర్యము

ఆకలితో క్షీణులైన క్రూరులైన రాక్షసుల దంతములచే మఱియు కరాళములైన నఖరములచే చూర్ణితములైన క్షోభితములైన నేత్రములు కలిగినటువంటి మీ ద్వేషులను వజ్రకల్పములైన జలగలు సమీపించి హింసించెదవు.

అవతరణికా

వాయపదేవుల సన్నిధిని పొంది ఉదాసించినవారికి నిత్యసంసారమేగాని అంధంతమఃప్రాప్తి కలుగదు అని ఈ శ్లోకములో చెప్పుచున్నారు

అస్మిన్ అస్మద్గురూణాం హరిచరణచిరధ్యానసన్మంగలానాం

యుష్మాకం పార్శ్వభూమిం ధృతరణరణికస్వర్గిసేవ్యాం ప్రపన్నః .

యస్తూదాస్తే స ఆస్తేsధిభవమసులభక్లేశనిర్మోకమస్త-

ప్రాయానందం కథంచిన్నవసతి సతతం పంచకష్టేsతికష్టే ..12..

అన్వయము

అస్మిన్ హరిచరణచిరధ్యానసన్మంగలానాం అస్మద్గురూణాం యుష్మాకం ధృతరణరణికస్వర్గిసేవ్యాం పార్శ్వభూమిం ప్రపన్నః అపి యః తు ఉదాస్తే సః అసులభక్లేశనిర్మోకం అస్తప్రాయానందం అధిభవం ఆస్తే కథంచిత్ అతికష్టే పంచకష్టే సతతం న వసతి..12..

అన్వయార్థము

అస్మిన్ – ఈ లోకములో హరిచరణచిరధ్యానసన్మంగలానాం అస్మద్గురూణాం – హరిచణములను చిరకాలము ధ్యానించినందువలన శుద్ధులైన మాగురువులైన యుష్మాకం – మీయొక్క ధృతరణరణికస్వర్గిసేవ్యాం పార్శ్వభూమిం – తహ తహలాడు దేవతలచే సేవింపబడు సామీప్యమును ప్రపన్నః అపి - పొందినవాడైనను యః తు - ఏవ్వడైతే ఉదాస్తే - ఉదాసీనడౌనో సః - అతడు అసులభక్లేశనిర్మోకం – క్లేశములు నశిపనటువంటి అస్తప్రాయానందం – ప్రయముగా ఆనందరహితమైన ధిభవం – సంసారములోనే ఆస్తే – ఉండును కథంచిత్ - ఎప్పటికీ తికష్టే – అత్యంత కష్టతరమైన పంచకష్టే - పంచకష్టమనెడి తమస్సులో సతతం న వసతి – శాశ్వతముగా పడడు.

తాత్పర్యము

ఈ లోకములో నిరంతరము భగవంతుని ధ్యానముచేయుటవలన శుద్ధులైన గురువరేణ్యులైన మీయొక్క సామీప్యమును పొందినను మీ మీద భక్తిచేయనివాడు ధుఃఖమే ఎక్కువగనున్న ఈ సంసారములోనే ఉండును మీ సామీప్యమహిమచే అంధంతమస్సులోకి వెళ్ళడు.

శ్లోకము 11

అవతరణికా

ఇటుల వాయుదేవుని భక్తులకు కలుగు ఫలమును నిరూపించి తదుపరి తద్ద్వేషులకు కలుగు ఫలమును నిరూపించుచున్నారు -

ఉత్తప్తాత్యుత్కటత్విట్ప్రకటకటకటధ్వానసంఘట్టనోద్యత్-

విద్యుత్వ్యూఢస్ఫులింగప్రకరవికిరణోత్క్వాథితే బాధితాంగాన్ .

ఉద్గాఢం పాత్యమానా తమసి తత ఇతః కింకరైః పంకిలే తే

పంక్తిర్గ్రావ్ణాం గరిమ్ణా గ్లపయతి హి భవద్ద్వేషిణో విద్వదాద్య ..11..

అన్వయము

విద్వదాద్య, తే కింకరైః తతః ఇతః ఉత్తప్తాత్యుత్కటత్విట్ ప్రకటకటకటధ్వానసంఘట్టనోద్యత్-

విద్యుత్వ్యూఢస్ఫులింగప్రకరవికిరణోత్క్వాథితే పంకిలే తమసి

ఉద్గాఢం పాత్యమానా గ్రావ్ణాం పంక్తిః

బాధితాంగాన్ భవద్ద్వేషిణః గరిమ్ణా గ్లపయతి హి

తాత్పర్యము

జ్ఞానిశ్రేష్ఠుడవైన వాయుదేవ, మీ కింకరులచే స్ఫుటముగా కటకటధ్వనితో నిండియున్నపరస్పరసంఘర్షణచే వెదజిమ్ము మెరుపులవలె ప్రకాశించు అగ్నికణముల పుంజముల ఉడుకుద్రవముచే పంకమువలెనున్న అంధంతమస్సులో ఎల్లడ పడవేయబడు కాగియున్న ప్రఖరమైన పాషాణముల పంక్తియు తన భారముచే పీడింపబడు అంగములుకల మీ ద్వేషులను మిక్కిలి దుఃఖపఱచును.

పదార్థములు

క్వాథితే పంకిలే తమసి – మడ్డిచే పంకమువలెనున్ను తమస్సులో

గరిమ్ణా - తన భారముచే

గ్లపయతి – గ్లాని కలిగించును