నఖస్తుతి - 1

Super User

సుధాంతవేదాంతం - మంగలానుశాసనం

శ్రీవేదాంతమహాసముద్రమునకు నే నొప్పించి సూత్రాహిపుం-

చక్కగ గట్టి మదీయధీసుమహాసన్మందరంబొక్కటిన్ .

శ్రీమన్న్యాయసుధామృతరసాస్వాదంబుకై బాగుగన్

మంథనజేసెద శ్రీనివాసకృపతో మరుదంశ  పై భక్తితో ..

 

నఖస్తుతి

మన గురువులైన శ్రీమధ్వాచార్యులవారు సర్వజ్ఞులు. కరుణామూర్తులు. వారు సకల అరిష్టములనెడి కారడవిని కాల్చు అగ్నివలె శోభిల్లుచున్నటువంటి శ్రీలక్ష్మీనరసింహుని నఖాల స్తుతిని మనకు రచించి అనుగ్రహించారు. భక్తులను అనుగ్రహించుటకే ఈ స్తుతికుసమమును శ్రీమదాచార్యులవారు రచించారు.  

నఖస్తుతి

పాంత్వస్వ్మాన్ పురుహూతవైరిబలవన్మాతంగమాద్యద్ఘటా-

కుంభోచ్చాద్రివిపాటనాధికపటుప్రత్యేకవజ్రాయితాః .

శ్రీమత్కంఠీరవాస్యప్రతతసునఖరా దారితారాతిదూర-

ప్రధ్వస్తధ్వాంతశాంతప్రవితతమనసా భావితా నాకివృందైః ..1..

శ్లోకాన్వయము

  1. పురుహూతవైరిబలవన్మాతంగమాద్యద్ఘటాకుంభోచ్చాద్రివిపాటనాధికపటుప్రత్యేకవజ్రాయితాః
  2. నాకివృందైః దారితారాతిదూరప్రధ్వస్తధ్వాంతశాంతప్రవితతమనసా భావితాః
  3. శ్రీమత్కంఠీరవాస్యప్రతతసునఖరాః
  4. అస్మాన్ పాంతు.

తాత్పర్యము

పురుహూతుడైన ఇంద్రుని వైరులనెడి బలిష్ఠమైన మదించిన గజసమూహముల కుంభస్థలమనెడి పర్వతములను ఛేదించు వజ్రములవలె శోభిల్లుచున్నటువంటి,  దేవతాసమూహములచే  అజ్ఞానరహితమైన శాంతమైన రాగద్వేషాదికాలుష్యములేక నిర్మలమైన  బహ్వర్థవిషయకమైన మనస్సుచే ధ్యానింపబడుచున్నటువంటి  నరసింహుని విశాలనఖరములు మమ్ములను సదా రక్షించుగాక.

వివరణ

శ్రీనరసింహుని నఖములు ఒక్కొక్కటియును వజ్రమువలె నిశితమైనవి. సంసారమునకు దుర్జ్ఞానము మరియు దుష్కర్మములు కారణములు. ఇవి ముముక్షువులకు అరిష్టములు. ఇటువంటి అరిష్టములకు అభిమానులగుటచే కారణులైనవారు  దైత్యులు. సురవైరులు. గజములవలె బలవంతులు. మదించియున్నవారు. అటువంటి దైత్యగజముల కుంభస్థలాలు ఎత్తైన పర్వతములవలెనున్నవి. వాటిని చీల్చి చండాడుటలో ఇంద్రుని వజ్రమువలె అత్యంత దక్షమైనటువంటివి శ్రీనరసింహుని విశాలమైన నఖరాలు. కావున నఖస్తుతిని చేసినచో సకల అనిష్టముల నివృత్తి కలుగుననుటలో ఎటువంటి సందేహమూ లేదు. అందుచేతనే బ్రహ్మాది సకల ఉత్తమాధికారలుచే ఉపాసింపబడుచున్నవి ఈ నఖరాలు.  జీవులలో ఉత్తములైనటువంటివారు బ్రహ్మాది దేవతలు. వారు అజ్ఞానమనెడి అంధకారమునుండి దూరముగనున్నవారు. వారి మనస్సు రాగాదిదోషములు లేనటువంటిది. నిర్మలమైనటువంటిది. అంతటి మనస్సుచే వారు శ్రీనృసింహుని నఖరములను ధ్యానించెదరు. అటువంటి నఖరాలు తమతో సహితముగా సకలసత్పురుషలందరినీ రక్షించుగాక అని మొదటి పద్యములో స్తుతించుచున్నారు.

పదవివరణము

పురుహూతుడు – ఇంద్రుడు. యజ్ఞాదులలో మిక్కిలి పూజింపబడువాడు. పురు హూయతే యజ్ఞేషు ఇతి. ఇంద్రో మరుత్వాన్ మఘవాన్ పురుహూతః పురందరః ఇతి అమరః

వైరులు – శత్రువులు. ఇంద్రశత్రువులు అంటే దైత్యులన్నమాట. (వైరీ – అత ఇనిఠనౌ (5.2.115) మత్వర్థే ఇనిః), రిపౌ వైరి సతపత్నారి ఇత్యమరః

బలవన్మాతంగములు – బలిచిన గజాలు ( బలం ఎషాం అస్తి ఇతి బలవంతః, తదస్యాస్త్యస్మిన్ ఇతి మతుప్, 5.2.94),  

మాద్యద్ఘటా  - మదించిన సమూహములు

కుంభము – గజముల కుంభస్థలము

ఉచ్చాద్రి – ఎత్తైన పర్వతము

విపాటనాధికపటు – చీల్చివేయుటలో అత్యంత దక్షమైనటువంటివి

ప్రత్యేకవజ్రాయితాః – ఒక్కొక్కటియునూ వజ్రమువలె చూపుగానున్నవి

కంఠీరవము – సింహము

ఆస్యము – ముఖము (వక్త్రాస్యే వదనం తుండం – అమరకోశము)  సింహముయొక్క ముఖము అది గలవాడు కంఠీరవాస్యుడు శ్రీనృసింహుడు.

సంధిచ్ఛేదము

పాంతు అస్మాన్ (ఉ-వ, యణ్ సంధి,  ఇకో యణ్ అచి)

వృత్తము

శార్దూలవిక్రీడతం స్రగ్ధరా ఈ రెండింటని అత్యద్భుతంగా మేళవించి నరసింహుని స్తుతించడం ఇచ్చట విశేషం. పూర్వార్ధంలో శార్దూలవిక్రీడితము ఉత్తరార్ధంలో స్రగ్ధరా హిరణ్యకశిపుడిపై శార్దులంలాగా విక్రమించి పిదప  ప్రేగులని మాలగా ధరించిన స్రగ్ధరా వైభవాన్ని అనుకరిస్తూ ఉన్నది.