వాయుస్తుతి - 6

Super User

శ్లోకము – 2

శ్రీలక్ష్మీనరసింహుడు సర్వోత్తముడు. సమ-అభ్యధిక-రహితుడు. ఈ ప్రమేయాన్ని ముముక్షువైనవాడు అవశ్యము సర్వకాలములయందు తెలిసియుండవలెనను ఆశయముతో శ్రీమదాచార్యులవారు  ప్రమాణపురస్సరముగా శ్రీనృసింహుని సర్వోత్తమమత్వమును ప్రతిపాదనెజేయుచూ స్తుచించుచున్నారు.

లక్ష్మీకాంత సమంతతోపి కలయన్ నైవేశితుస్తే సమం .

పశ్యామ్యుత్తమవస్తు దూరతరతోపాస్తం రసోయోష్టమః ..

యద్రోషోత్కరదక్షనేత్రకుటిలప్రాంతోత్థితాగ్నిస్ఫురత్

ఖద్యోతోపమవిస్ఫులింగభసితా బ్రహ్మేశశక్రోత్కరాః ..

శ్లోకాన్వయము

1. హే లక్ష్మీకాంత,

2.యద్రోషోత్కరదక్షనేత్రకుటిలప్రాంతోత్థితాగ్నిస్ఫురత్ఖద్యోతోపమవిస్ఫులింగభసితాః బ్రహ్మేశశక్రోత్కరాః 

3. సమంతతః అపి కలయన్

4. ఈశితుః తే సమం

5. నైవ పశ్యామి

6. ఉత్తమవస్తు దూరతః అపాస్తం యః అష్టమః రసః

తాత్పర్యము

ఓయీ లక్ష్మీకాంతుడా,  సర్వస్వామివైన నీకు సములైనవారిని సమస్తప్రపంచమున మనస్సుచే, ప్రమాణములచే వెతికిజూసినను నేను కనజాలను. మరి నికంటె ఉత్తములుండుట అష్టమరసమువలె అత్యంత అసాధ్యము. బ్రహ్మరుద్రేంద్రాదులుకూడా క్రుద్ధుడవైన నీ క్రీగంటన చిమ్మిన అగ్నికణములనెడి ఖద్యోతములచే దహింపబడుదురుగదా.

వివరణము

భగవంతుడైన శ్రీలక్ష్మీనృసింహుడు సర్వచరాచరప్రపంచమునకు ఈశ్వరుడు. సర్వస్మామి. అతని సములైనవారు ఎవ్వరు లేరు. ఇట్లు వేదాదిప్రమాణములు చాటి చెప్పుచున్నవి. మనసా ఆలోచించిచూసిననూ అదని సములైనవారు ఈ ప్రపంచమున మరింకొకరు లేరు. మరి అతనికంటె ఉత్తములెవరానా ఉన్నారా అనునటువంటి ప్రశ్న రాదు. దానికి దృష్టాంతము 8వ రసము. ఈ ప్రపంచములో మధుర, ఆమ్ల, కటు, కషాయ, లవణ, తిక్త అను ఆరు రసములు మాత్రమే ఉన్నవి. ఏడవ రసమే లేదు. మరి ఎనిమిదవ రసము ఎక్కడిది. అటులనే శ్రీహరికి సములైనవారే లేనప్పుడు అతనికన్న ఉత్తములైనవారి ఉనికెక్కడిది. మరి, ప్రసిద్ధులైన బ్రహ్మాదిదేవోత్తములలో ఎవరైనా శ్రీహరికంటె ఉత్తములు కలరా అంటే వారందరూ ప్రళయకాలంలో శ్రీహరిక్రోధాగ్నిని భస్మమైయ్యెడివారే.

పదవివరణము

లక్ష్మీకాంత – ఇది శ్రీహరికి సంబోధనము. లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా అనునవి శ్రీమహాలక్ష్మిపేర్లు. కాంత అంటే పతి అని అర్థము.

ఈశితుః – స్వర్వస్వామియైన

తే – నీకు

సమం – సములైన, సదృశులైనవారు

సమంతతోపి – సమస్త జగమునందు

కలయన్ – విచారించి చూసిననూ

న పశ్యామి – చూడజాలకున్నాను. దృశిర్ ప్రేక్షణే – లట్

ఉత్తమవస్తు – ఉత్తమమైనటువంటి వస్తువు

అష్టమః రసః ఇవ – ఎనిమిదవ రసమువలె అష్టానాం పూరణః అష్టమః తస్య పూరణే డట్ (పా. 5.2.48) నాంతాదసంఖ్యాదేర్మట్ (పా. 5.2.49) చే మడాగమము.

అపాస్తం – నిరాకృతమైనది.

బ్రహ్మేశశక్రోత్కరాః – బ్రహ్మ, ఈశ, శక్ర వీరి ఉత్కరాః సమూహములు

యద్రోష – శ్రీలక్ష్మీనృసింహుడి రోషము

ఉత్కరదక్షనేత్రకుటిలప్రాంత – ఉత్కృష్టమైన దక్షిణనేత్రముయొక్క క్రీగంట

ఉత్థితాగ్ని – పుట్టినటువంటి అగ్ని

స్ఫురత్ ఖద్యోతోపమ – శోభిల్లు ఖద్యోతములనెడి కీటవిశేషములవలెనున్న

విస్ఫులింగభసితాః – అగ్నికణములచే దహించబడినవారైతిరి

సంధిచ్ఛేదము

సమంతోపి – సమంతతః అపి (విసర్గసంధి అః + అ = ఉ + అ = ఓ + అ = ఓ)

నైవేశితుస్తే – న ఏవ (వృద్ధి)  ఈశితుః తే (విసర్గ-సకార)

పశ్యామ్యుత్తమ – పశ్యామి ఉత్తమ (ఇ + అ = య) యణ్ సంధి ఇకోయణచి (పా. 6.1.78)   

వృత్తము

శార్దూలవిక్రీడితము