శ్రీమద్విష్ణ్వంఘ్రినిష్ఠాతిగుణగురుతమశ్రీమదానందతీర్థ-
త్రైలోక్యాచార్యపాదోజ్వలజలజలసత్పాంసవోస్మాన్ పునంతు .
వాచాం యత్ర ప్రణేత్రీ త్రిభువనమహితా శారదా శారదేందు-
జ్యోత్స్నాభద్రస్మితశ్రీధవలితకకుభా ప్రేమభారం బభార ..
శ్లోకాన్వయము
- యత్ర వాచాం ప్రణేత్రీ త్రిభువనమహితా శారదేందుజ్యోత్స్నాభద్రస్మితశ్రీధవలితకకుభా శారదా ప్రేమభారం బభార
- శ్రీమద్విష్ణ్వంఘ్రినిష్ఠాతిగుణగురుతమశ్రీమదానందతీర్థత్రైలోక్యాచార్యపాదోజ్వలజలజలసత్పాంసవః
- అస్మాన్ పునంతు
తాత్పర్యము
ఎటువంటి పాదరజములయందు చదువుల తల్లి త్రిలోకవందియెయైన చిరునవ్వుకాంతితో దిక్కులను ధవళింపజేయు భారతీదేవి మిక్కిలి ప్రేమను చూపునో అటువంటి శ్రీమద్విష్ణుపాదనిష్ఠులు గుణశ్రేష్ఠులు జగద్గురువులైనటువంటి శ్రీమదానందతీర్థాచార్యుల పాదకమలములయందు శోభిల్లు ధూళికణములు మమ్ములను పునీతముజేయుగాక.
వివరణము
చదువుల తల్లి విద్యాభిమైనినియైనటువంటి శ్రీభారతీదేవి. త్రిలోకవందిత. తన చిరునవ్వుకాంతితో చతుర్దిక్కులనూ ధవళింపజేయు దేవతాశిరోమణి. అటువంటి ఇల్లాలు మిక్కిలి ప్రేమతో తన పెనిమిటియైన శ్రీమదానందతీర్థాచార్యులవారి పాదకమలములయందు శోభిల్లు ధూళికణములను ఆదరించును. శ్రీమదానందతీర్థాచార్యులవారు విష్ణుపాదపద్మైకనిష్ఠులు. గుణజ్యేష్ఠులు. గరుడశేషరుద్రాదిదేవతలకంటె ఉత్తములు. వారికి జ్ఞానోపదేశముచేయువారు. అటువంటి ఆచార్యులవారి ధూళికణములు మమ్ము పునీతులను జోయుగాక అని ప్రార్థించి శిష్యులకు బోధించుటకు గ్రంథములో నిబంధనము చేయుచున్నారు. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశో వాపి తన్ముఖం – కావ్యాదర్శ 1.14 లో చెప్పినట్లు మంగళాచరణము 1. ఆశీర్వాదము 2. నమస్కారము 3. వస్తు నిర్దేశము ఈ మూడు ప్రకారాలుగూ ఉండును. ఇచ్చట ఆశీర్వాదరూపమైన మంగళాచారణమున్నదని పాఠకులు గమనించగలరు.
పదవివరణము
శ్రీమత్ – కాంతియుక్తమైన (ఐశ్వర్యాద్యుపేతమైన) (శ్రీః అస్య అస్తి ఇతి శ్రీమాన్)
విష్ణ్వంఘ్రి – శ్రీవిష్మువుయొక్క పాదము
నిష్ఠ – భక్తి
అతిగుణ – అత్యంత శ్రేష్టమైన గుణములచే కూడిన
గురుతమ – ఉత్తమగురువులైన
శ్రీమదానందతీర్థత్రైలోకాచార్యులు – శ్రీమదానందతీర్థులనెడి త్రిలోకములకు ఆచార్యులైనవారు
పాదోజ్వలజలజ – పాదములనెడి ఉజ్వల పద్మములు
లసత్ – శోభిల్లుచున్నటువంటి
పాంసవః – ధూళికణాలు
అస్మాన్ – మనలను
పాంతు – పావనము జేయుగాక.
వాచాం ప్రణేత్రీ – వాగభిమానిని, అథవా వాక్ అంటే సకలశ్రుతిస్మృతీతిహాసపురాణాలు. వాటిని ప్రణేత్రీ - చక్కగా గరుడశేషరుద్రేంద్రాదులకు ఉపదేశించునటువంటి దేవత.
దీనికి ఆధారం బ్రహ్మాండపురాణం.
యస్యాః ప్రసాదాత్ పరమం విదంతి శేషః సుపర్ణో గిరిశః సురేంద్రః .
మాతా చ ర యైషాం ప్రథమైవ భారతీ సా ద్రౌపదీ నామ బభూవభూమౌ . మహాభారతతాత్పర్యనిర్ణయము 2.168
త్రిభువన మహితా – త్రయాణాం లోకానాం సమాహారః త్రిభువనం త్రుభువనేన మహితా – మూడు లోకములచే పూజింపబడినటువంటి
శారదా – భారతీదేవి
శారదేందుజ్యోత్స్నా – శరది భవః శారదః స చాసౌ ఇందుశ్చ శారదేందుః శరత్కాలపు చంద్రుడు. జ్యోత్స్నా అనిన కాంతి. అటువంటి చంద్రునికాంతి.
భద్రస్మితశ్రీ – శుభ్రమైన మందహాసపు కాంతి
ధవలితకకుభా – దిక్కులను వెలిగింపజేసినటువంటి
ప్రేమభారం – అతిశయమైన ప్రేమను
బభార - పొందియున్నదో