వాయుస్తుతి - 8

Dr. Rachuri Acharya

అవతరణికా

గురువులపై దేవతలపై తారతమ్యముగా చేయు భక్తి సకలపురుషార్థసాధనమైనది గావున అవశ్యముగ అనుష్ఠానముచేయవలసినది. అటువంటి భక్తిని ఎటుల చేయవలెను ఆ భక్తియొక్క ఫలమేమి అని ఈ శ్లోకములో చెప్పుచున్నారు

 

విష్ణోరత్యుత్తమత్వాదఖిలగుణగణైస్తత్ర భక్తిం గరిష్ఠాం

సంశ్లిష్టే శ్రీధరాభ్యామముమథ పరివారాత్మనా సేవకేషు .

యః సంధత్తే విరించిశ్వసనవిహగపానంతరుద్రేందపూర్వే-

ష్వాధ్యాయంస్తారతమ్యం స్ఫుటమవతి సదా వాయురస్మద్గురుస్తమ్ ..15..

అన్వయము

యః అఖిలగుణగణైః విష్ణోః అత్యుత్తమత్వాత్ శ్రీధరాభ్యాం సంశ్లిష్టే తత్ర గరిష్ఠాం భక్తిం సంధత్తే అథ అముం (ప్రతి) పరివారాత్మనా సేవకేషు విరించిశ్వసనవిహగపానంతరుద్రేందపూర్వేషు తారతమ్యం ఆధ్యాయన్ భక్తిం సంధత్తే తం అస్మద్గురుః స్ఫుటం అవతి

తాత్పర్యము

ఎవడైతే సకలగుణములతో శ్రీమహావిష్ణువు అత్యుత్తముడైనందువలన శ్రీదేవి, భూదేవులతో కూడియున్న అతనియందు అత్యుత్తమమైన భక్తిని చేయునో మఱియు అతని పరివారరూపముగా సేవకులైన బ్రహ్మ, వాయు, గరుడ, శేష, ఇంద్ర మొదలైనవారియందు గల తారతమ్యమును తెలియుచు వారియందు భక్తిని చేయునో అతడిని మన గురువులైన ముఖ్యప్రాణులు బాగుగా రక్షింతురు.