వాయుస్తుతి - 3

Super User

అవతరణికా

కవియైన శ్రీత్రివిక్రమపండితాచార్యుడు మొదటి రెండు శ్లోకములలో నమస్కరించుటకు ప్రయోజకమైన వాయుదేవుని వైశిష్ట్యమును తెలుపి అధికారులైనవారిని వాయుదేవుని స్తుతిని చేయుటకు ప్రవర్తించుటకై ఉపాసించినవారికి మోక్షానందరూపమైన అభ్యుదయాన్ని ద్వేషులకు ఆత్యంతికదుఃఖానుభవరూపమైన అనర్థప్రాప్తిని తెలియజైయుచు వాయుదేవుని స్తోత్రించటకు నేనెంతవాడనని తన వినయమును ప్రకటించుచున్నాడు

వాయుస్తుతి - 3

జన్మాధివ్యాధ్యుపాధిప్రతిహతివిరహప్రాపకాణాం గుణానామ-

గ్ర్యాణామర్పకాణాం చిరముదితచిదానందసందోహదానాం .

ఏతేషామేషదోషప్రముషితమనసాం ద్వేషిణాం దూషకాణాం

దైత్యానామార్తిమంధేతమసి విదధతాం సంస్తవే నాస్మి శక్తః ..3..

శ్లోకాన్వయము

ఏషః

జన్మాధివ్యాధ్యుపాధిప్రతిహతివిరహప్రాపకాణాం

అగ్ర్యాణాం

గుణానాం అర్పకాణాం

చిరం ఉదితచిదానందసందోహదానాం

దోషప్రముషితమనసాం దైత్యానాం అంధేతమసి చిరం ఆర్తిం విదధతాం

ద్వేషిణాం దూషకాణాం

ఏతేషాం

సంస్తవే నాస్మి శక్తః

తాత్పర్యము

నేను జననము, మనోవ్యథ, రోగములకు ఆశ్రయమైనటువంటి శరీరముయొక్క పునః ప్రాప్తిని నివారించునటువంటి అజ్ఞాననివృత్తిరూపమైనటువంటి మోక్షమును ప్రసాదింపజేయునటువంటి, దోషముచే అపహరింపబడిన మనస్సుగలవారైన దైత్యులకు అంధంతమస్సులో చిరకాలము దుఃఖమునొసంగునటువంటి, ద్వేషులను దూషించునటువంటి పాదధూళిని స్తుతించుటకు అసమర్థుడను.

వివరణము

శ్రీవాయుదేవుని పాదధూళియొక్క మహిమను స్తుతించుట సామాన్యుల తరముగాదు. కవి ఇచ్చట చెప్పదలచినదేమనగా పాదధూళియొక్క మహిమ అపారమైనది. దానిని స్తుతించుటకు నేను అసమర్థుడను అని.

జననము, మరణము, మనోవ్యథలు, రోగరుజినములు వీటికి ఆశ్రయమైనటువంటిది ఈ శరీరము. జాతస్య హి ధృవో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అనిచెప్పినట్లు పునః పునః ఈ జననమరణాదులు సంభవించుచునే ఉండును. అజ్ఞానమున్నంచవరకు ఇది తప్పదు. కావను ఈ అజ్ఞానమును నివారించుకొనవలెననిన వాయుదేవులను ఆశ్రయించవలెను. వాయుదేవుని పాదధూళి అజ్ఞానమును నివారించి మోక్షమును ప్రసాదింపజేయు సామర్థ్యము కలిగినది. భగవద్ద్వేషులైన అసురులను అంధంతమస్సులో చిరకాలము దుఃఖమనుభవింపజేయునటువంటిది. ద్వేషులను ధూషించునటువంటిది. ఇట్టి మహామహిమోపేతమైన పాదధూళిని స్తుతించుటకు మనమెంతవారము. ఇది రచయితయొక్క వినయోక్తి.

పదవివరణము

ఏషః – ఇతడు (కవి)  

జన్మ – జననము

ఆధి – మనోవ్యథ

వ్యాధి – రోగము

ఉపాధి – ఆశ్రయమైనటువంటి శరీరము

ప్రతిహతి – పునః పునః ప్రాప్తి

విరహము – నివృత్తి

ప్రాపకాణాం - సంపాదించునటువంటి

అగ్ర్యాణాం గుణానాం అర్పకాణాం – శ్రేష్టములైనటువంటి గుణములను పెంపొందించునటువంటి

చిరం ఉదితచిదానందసందోహదానాం – శాశ్వతముగ అభివ్యక్తమైనటువంటి చిదానందమునొసంగునటువంటి

ప్రముషిత - అపహరింపబడిన

చిరం – కలకాలము

ఆర్తిం – దుఃఖమును

విదధతాం - ఇచ్చునటువంటి

ద్వేషిణాం దూషకాణాం – ద్వేషులను దూషించునటువంటి

ఏతేషాం – ఈ పాధధూళిని

సంస్తవే నాస్మి శక్తః – స్తుతించుటకు నేను అశక్తుడను