వాయుస్తుతి – 5
అవతరణికా
కవివర్యులు వాయుదేవుని స్తుతిచేయుటకు తనకు సామర్థ్యములేదని తెలిపి అటువంటి స్తుతిచేయుటకు కారణమైన జ్ఞానమును ప్రార్థించుచునానారు.
ఉద్యద్విద్యుత్ప్రచండాం నిజరుచినికరవ్యాప్తలోకావకాశో
బిభ్రద్భీమో భుజే యోభ్యుదితదినకరాభాంగదాఢ్యప్రకాండే .
వీర్యోద్ధార్యాం గదాగ్ర్యామయమిహసుమతిం వాయుదేవో విదధ్యాత్
అధ్యాత్మజ్ఞాననేతా యతివరమహితో భూమిభూషామణిర్మే ..5..
అన్వయము
నిజరుచినికరవ్యాప్తలోకావకాశః యః ఉద్యద్విద్యుత్ప్రచండాం వీర్యోద్ధార్యాం గదాగ్ర్యాం అభ్యుదితదినకరాభాంగదాఢ్యప్రకాండే బిభ్రత్ అధ్యాత్మజ్ఞాననేతా యతివరమహితః భూమిభూషామణిః వాయుదేవః మే సుమతిం విదధ్యాత్.
తాత్పర్యము
తనస్వభావపు కాంతిచే సమగ్రభువనమండలమును వ్యాపించియున్న, వెదజిమ్ము ప్రకాశముతో కూడి ప్రచండమైన బలముచే ఎత్తుటకు సాధ్యమైన ఉత్తమమైన గదను ఉదయరవికాంతులచే ఆఢ్యమైన దోర్దండములతో ధరించియున్న అధ్యాత్మజ్ఞానప్రదులైన యతివరులచే పూజింపబడు భూమండలమునకు భూషణమైనటువంటి వాయుదేవులు నాకు స్తుతిచేయుటకు వలయు బుద్ధిని ప్రసాదింతురుగాక.