శ్లో 7
అవతరణికా |
వాయుదేవలను స్తుతిస్తూ భక్తిని ప్రసాదింపవలసినదిగా ప్రార్థిస్తున్నారు |
శ్లోకము
మూర్ధన్యేషోంజలిర్మే దృఢతరమిహ తే బధ్యతే బంధపాశచ్ఛేత్రే దాత్రే సుఖానాం
భజతి భువి భవిష్యద్విధాత్రే ద్యుభత్ర్తే
అత్యంతం సంతతం త్వం ప్రదిశ పదయుగే హన్త సంతాపభాజాం
అస్మాకం భక్తిమేకాం భగవత ఉత తే మాధవస్యాథ వాయోః ..7..
అన్వయము
(మే మూర్ధని) (ఎషః అంజలిః) (భజతి ఇహ బంధచ్ఛేత్రే సుఖానాం దాత్రే భవిష్యద్విధాత్రే ద్యుభర్త్రే తే) (దృఢతరం బధ్యతే) (హంత అత్యంతం సంతతం సంతాపభాజాం అస్మాకం) (భగవతః మాధవస్య) అథ (తే) (పదయుగే) (భక్తిం) ( ప్రదిశ)
తాత్పర్యము
ఓయీ వాయుదేవుడా, భజించు జనులకు ఈ సంసారములో బంధమును తొలగించునటువంటి, సుఖములనిచ్చునటువంటి, భావిబ్రహ్మవైనటువంటి భారతీదేవికి భర్తయైనటువంటి నీకై నా శిరస్సుపై ఈ అంజలిని అత్యంతదృఢముగా జోడించెద సుమా, సదాకాలము అతిశయమైన సంతాపముచే కూడినటువంటి మావంటివారకు భగవంతుడైన మాధవునియొక్క మఱియు మీయోక్క పదయుగములయందు భక్తిని ప్రసాదించు.
వివరణము
వాయుదేవలు అందరి సంసారబంధమును తొలగించగల దేవతోత్తములు. అటుల భగవంతునిచే అనుగ్రహము పొందినవారు. విష్ణుర్మోక్షాదిదాతా చ వాయుశ్చ తదనుజ్ఞయా అని శ్రీమదాచార్యులవారు సెలవిచ్చారు. బంధమును తొలగించడమేకాకుండా మోక్షసుఖమును కూడా వాయుదేవులు ప్రసాదిస్తారు. భగవంతుడి అనుగ్రంచో వచ్చే కల్పంలో ఈ వాయుదేవులే బ్రహ్మపదవిని అలంగరిస్తారు. సోయం నవవ్యాకరణార్థవేత్తా బ్రహ్మా భవిష్యత్యపి తే ప్రసాదాత్ అని వాల్మీకిరామాయణంలో చెప్పినట్లుగా రాబోవు బ్రహ్మకల్పములో ఇతడే బ్రహ్మపదవిని అలంకరిస్తాడు. ఈ వాయుదేవుడు భారతీదేవికి భర్త. భారతీపతి. ఎవరైతే వీరియందు దృఢమైన భక్తితో అంజలి జోడించి నమస్కరిస్తారో వారిపై దయగలిగి వారిని సంతాపములనుండి దూరముచేసి భగవంతునియందు మఱియు వాయుదేవులయందు విశేషమైన భక్తిని ప్రసాదిస్తారు. కావున వారికి నమస్కారుముజేయుచూ భక్తిని ప్రార్థించుచున్నారు.