అవతరణికా
వెనుకటి శ్లోకమున వాయుదేవులపై భక్తిని ప్రార్థించితిరి. ఈ శ్లోకమున వాయుదేవుల భ్రూవిభ్రమముయోక్క అనేక మహిమలను వర్ణించుచున్నారు
శ్లోకము
సాభ్రోష్ణాభీశుశుభ్ర-ప్రభమభయ నభో-భూరిభూభ్రుద్విభూతి-
భ్రాజిష్ణుర్భూర్ఋభూణాం భవనమపి విభోభేది బభ్రే బభూవే .
యేన భ్రూవిభ్రమస్తే - భ్రమయతు సుభృశం - బభ్రువద్దుర్భృతాశాన్
భ్రాంతిర్భేదావభాసస్త్వితి భయమభిభూ-భోక్ష్యతో మాయి భిక్షూన్ ..8..
అన్వయము
హే అభయ విభో తే యేన (భ్రూవిలాసేన) (సాభ్రోష్ణాభీశుశుభ్రప్రభం నభః) (భూరిభూభ్రుద్విభూతిభ్రాజిష్ణుః భూః ) (ఋభూణాం భవనమపి) (అభేది) (బభ్రే) (బభూవే) (తాదృశః) (అభిభూః భ్రూవిభ్రమః) ((బభ్రువత్ దుర్భృతాశాన్ భేదావభాసః భ్రాంతిః తు ఇతి (వదతః) (అత ఏవ) భయం భోక్ష్యతో మాయిభిక్షూన్) భ్రుశం భ్రమయతు
తాత్పర్యము
ఓ వ్యాప్తుడైన భయరహితుడైవైన వాయుదేవ, నీయొక్క భ్రూవిలాసముచే మేఘము, సూర్యచంద్రులతో సహితమైన ఆకాశము, బహుసంఖ్యాకమైన పర్వతముల ఐశ్వర్యములతే విలసిల్లే భూమి, దేవతల నివాసమైన స్వర్గము సృష్టి, స్థితి, సంహారములను పొందునో అటువంటి శత్రుసంహారకమైన భ్రూవిలాసము ముంగీసలవలె దురాశయుతమైన, భేదము భ్రాంతియని పలుకునటువంటి భయగ్రస్తులైనటువంటి మాయిభిక్షూన్ – మాయావాదమును చాటు భిక్షువులను భృశం – మిక్కిలిగా భ్రమయతు – తప్పుదారి పట్టించుగాక.
పదార్థము
అభ్ర – మోఘము
ఉష్ణాభీశు – సూర్యుడు
శుభ్రప్రభం – శుభ్రప్రభగల చంద్రుడు
నభః – ఆకాశము
భూరి – మిక్కిలి
భూభృత్ – పర్వతములు
విభూతి – ఐశ్వర్యము
భ్రాజిష్ణుః – ప్రకాశవంతమైన
భూః – భూమి
ఋభూణాం – దేవతలయొక్క
భవనం – గృహమైనటువంటి స్వర్గము
అభేది – నాశము పొందును
బభ్రే – రక్షితమౌను
బభూవే – సృష్టింపబడును